కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం హర్షనీయం. ఈ బిల్లుకు లోక్ సభలో 293 మంది మద్దతివ్వగా, 82 మంది వ్యతిరేకించారు. రాజ్యసభలో 125 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా, 99 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లో అణచివేతకు గురై, శరణార్ధులుగా మన దేశం వచ్చిన మైనారిటీలకు విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కల్పించడం కోసమే కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. దీని వల్ల శరణార్ధులుగా వచ్చి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న దాదాపు కోటిన్నర మందికి ఊరట కలగనుంది. వారిని ఈ దేశ పౌరులుగా గుర్తించడంతో పాటు వారికి ఓటుహక్కు, రిజర్వేషన్లతో సహా అన్ని హక్కులు కల్పించే అవకాశం కలిగింది. విపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా ఇది ముస్లింలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదు. భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కొన్ని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ప్రచారం చేయడం సరికాదు. నిజానికి ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్‌పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్‌లకు నిబంధనలు వర్తించవని సీఏబీ చెబుతోంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలు వర్తించవని బిల్లు స్పష్టం చేస్తోంది. నిర్దేశిత ప్రాంతంలో భారత పౌరులు భూములు లేదా ఆస్తులు కొనడం, ఉద్యోగాలు చేయడం ద్వారా స్థిరపడటాన్ని ఐఎల్‌పీ అడ్డుకొంటుంది.
బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా హోమ్ మంత్రి అమిత్ షా గారు ఈ బిల్లు ఎంతమాత్రం రాజ్యాంగ వ్యతిరేకం కాదని, దీని వల్ల దేశంలోని మైనారిటీలకు .001 శాతం కూడా హాని జరగదని స్పష్టంగా చెప్పారు.
ఈ చట్టం ద్వారా జరిగే మేలు గురించి ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. సాంఘిక, సామాజిక ఉద్యమకారుల ముసుగులో కొందరు ఈ చట్టం గురించి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పాల్సిన అవసరం వుంది. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని వాతావరణాన్ని కలుషితం చేసేందుకు రాజకీయ ప్రేరేపిత, దురుద్దేశపూరిత ప్రచారం జరుగుతోంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు మత ప్రాతిపదికన ఏర్పడిన దేశాలు. అక్కడ మైనారిటీ మతాలైన హిందూ, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ మతాలకు చెందిన వారిపై దాడులు నిత్యకృత్యం. మైనారిటీ మతస్థులు రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడతారు. అణచివేతను తట్టుకోలేక భారతదేశంలోకి వలస వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై వుంది. వలసదారుల్లో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.