ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం భారతదేశ ఔన్నత్యాన్ని చాటింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదం, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని,  విశ్వకళ్యాణం కోసం భారత్ కృషి చేస్తోందన్న మోడీ మాటలు అందర్నీ ఆలోచింపజేశాయి. 125 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద వినిపించిన శాంతి సామరస్య సందేశాలను గుర్తు చేస్తూ సాగిన ప్రసంగం ప్రపంచ శాంతి కోసం భారత్ ఎంతగా పరితపిస్తుందో తెలియచేసింది. ఒక వైపు అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూ మరో వైపు అదే బాటలో వున్న దేశాలకు తోడ్పడతామన్న మోడీ మాటలు భారతదేశ ఔదార్యాన్ని చాటి చెప్పాయి. ప్రపంచానికి మేం బుద్ధుడి శాంతి సందేశాన్నిచ్చామని, యుద్ధాన్ని కాదని చెప్పడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవతావాదం కోసం ప్రపంచం ఏకమవ్వాలని పిలుపునివ్వడం ప్రపంచానికి భారతదేశ పెద్దరికాన్ని చాటింది.

మరో వైపు ఇదే వేదికపై నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని, ప్రధాని మోడీని తీవ్రపదజాలంతో విమర్శించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఆయన దిగజారుడుతనాన్ని ప్రతిబింబించింది. అంతర్జాతీయ వేదికలపై ఆకతాయితనంతో వ్యవహరించి అభాసుపాలు కావడం పాకిస్థాన్ కు కొత్త కాదు. ఒక వైపు ఉగ్రభూతం కోరలకు పదును పెడుతూనే మరో వైపు భారత్ పై విషం కక్కడం వారికి అలవాటు. అభివృద్ధి, శాంతి, పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆరోగ్యం గురించి మోడీ మాట్లాడితే, ఉగ్రవాదం, యుద్ధం, అణ్వాయుధాలు, ఆర్ఎస్ఎస్ గురించి ఇమ్రాన్ మాట్లాడ్డం ప్రపంచమంతా గమనించింది. భారతదేశం సరిహద్దులకతీతంగా శాంతి, సామరస్యాలు కోరుకుంటోందని మోడీ ప్రసంగం చాటితే, తీవ్రపదజాలంతో సాగిన ఇమ్రాన్ ప్రసంగం టెర్రరిజానికి ఊతమిచ్చేలా, యుద్ధోన్మాదిని తలపించింది. స్వతంత్రం వచ్చాక దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి విదేశాంగ మంత్రి హోదాలో నాడు ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఎంతగా ఆకట్టుకుందో.. నేడు ప్రధాని మోడీ ప్రసంగం కూడా అంతగా ఆకట్టుకుందని చెప్పడంలో సందేహమేమీ లేదు.