‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి ఏడాది పాలనలో అనేక విజయాలు సాధించారు. దేశంపై చెరగని ముద్ర వేసే విధంగా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమర్థ విదేశాంగవిధానం, దౌత్యనీతితో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారు. ఏడాది కాలంలో కేంద్రప్రభుత్వం సాధించిన విజయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే…

ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్టలను కాపాడడానికి, వారి వివాహ హక్కులను పరిరక్షించడానికి ట్రిపుల్ తలాఖ్ రద్దు చట్టాన్ని తీసుకొచ్చారు. మధ్య యుగాల నాటి అనాగరిక సంప్రదాయాన్ని రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలకు న్యాయం జరిగింది.

దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన చట్టాన్నితీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదానికి పాల్పడే సంస్థలపైనే కాకుండా వ్యక్తులపై కూడా ఉగ్రవాద ముద్ర వేయవచ్చు. అలాంటి వ్యక్తులు విదేశాల్లో ఆశ్రయం పొందితే వారిని భారతదేశానికి తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది.

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్370ని రద్దు చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా చేయలేని పనిని సాహసోపేతంగా చేశారు. జమ్ము కశ్మీర్ ను సంపూర్ణంగా భారత యూనియన్ లో విలీనమైంది. మిగతా రాష్ట్రాలతో సమానంగా నిలిచింది. దేశంలోని మిగతా ప్రాంతాల వారు అక్కడ స్థిరపడడానికి, వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించింది. దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరే భారతీయ చట్టాలను అక్కడ అమలు చేయడానికి మార్గం ఏర్పడింది. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదమైన రామజన్మభూమి అంశానికి న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కారం లభించింది. సుప్రీం తీర్పు మేరకు రామాలయ నిర్మాణానికి కేంద్రం ట్రస్టును ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుకు భూమిని బదిలీ చేసింది.

భారతదేశానికి సరిహద్దు దేశాలైన అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మతపరమైన అణచివేతకు, పీడనకు గురైన హిందూ, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, పార్శీ, జైన మతస్థులు భారతదేశంలో ఆశ్రయం కోరితే వారికి పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల భారతదేశానికి ఆశ్రయం కోసం వచ్చిన ఎంతోమందికి మేలు జరగనుంది.

రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోడి అమెరికా వంటి పెద్ద దేశాలలోనే కాకుండా గతంలో ఏ ప్రధాని కూడా వెళ్లని దేశాలకు వెళ్లి, ఆయా దేశాలతో దౌత్య సంబంధాలు బలోపేతం చేశారు. ఆర్థిక, రక్షణ, విద్యత్ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అంతర్జాతీయంగా అన్ని దేశాలకు వివరించి, పాకిస్థాన్ ను ఏకాకి చేయడంలో విజయం సాధించారు. అమెరికాలో జరిగిన హౌడీ మోడీ, మనదేశంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలు విజయవంతమై, భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేశాయి.

రక్షణ పరంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను నియమించారు. త్రివిధ దళాలకు సిడిఎస్ అధిపతిగా వుంటారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్కు రూ.4,71,378 కేటాయించారు. రక్షణ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యమిచ్చారు. దీని వల్ల దేశీయ తయారీ రంగానికి వూపు రానుంది.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. బీమా, బ్యాంకింగ్ రంగాల్లో సంస్కరణలు. నష్టాల్లో వున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదుకునేందుకు చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేశారు.

జలశక్తి అభియాన్ ను ప్రకటించి దేశంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. రెండు లక్షల చెక్ డ్యామ్ లు, చెరువుల పునరుద్దరణ చేశారు.

రైతు సంక్షేమం కోసం ఏటా రూ.87 వేల  కోట్లు కేటాయించారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనల సరళీకరణ వల్ల రైతులకు మరింత లబ్ధి చేకూరింది. 60 ఏళ్లు దాటిన సన్న,చిన్నకారు రైతులకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ స్కీం ప్రవేశపెట్టారు.

దేశ రాజధానిలో పరిపాలనా విభాగాలన్నింటినీ ఒకే చోటకి తెచ్చే లక్ష్యంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 70 వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా రాష్ట్రపతి భవన్ కు కుడి, ఎడమ వైపులన పది భారీ భవనాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టారు. ముందుగానే లాక్ డౌన్ విధించడం వల్ల 138 కోట్ల జనాభాతో కిక్కిరిసి వున్న భారతదేశంలో కరోనా ప్రబలకుండా జాగ్రత్త పడ్డాం. కరోనా కల్లోలం నుంచి వివిధ రంగాలను కాపాడడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిని ప్రకటించింది. కరోనా సందర్భంగా భారత్ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది.

ఉపాధి హామీ కూలీ పెంచడంతో పాటు ఆ పథకానికి కేటాయించిన రూ.60 వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేల కోట్లు కేటాయించింది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. వలస కూలీలను ఆదుకునేందుకు వారికి మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందించనుంది. పేదలు దేశంలో ఎక్కడున్నా రేషన్ అందుకునేందుకు ‘ఒకే దేశం, ఒకేకార్డు’ పథకాన్ని తీసుకురానుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు అనేకం వున్నాయి. రాబోయే నాలుగేళ్లలో మోడి గారి సమర్థ నాయకత్వంలో భారతదేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయపరంగా, రక్షణపరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతుందన్న నమ్మకం నాకుంది.