Blog

Articles

28-01-2020 | 0 | 1290

తన విధానాలను వ్యతిరేకించే వ్యక్తులను, వ్యవస్థలను తుదముట్టించడం ఫ్యాక్షనిస్టుల లక్షణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనం దీన్ని చూస్తున్నాం. అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్మోహన రెడ్డి అమరావతిని కేవలం చట్టసభల నిలయంగా వుంచి, పరిపాలనను విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా బిల్లు తయారుచేయడం, దాన్ని అసెంబ్లీ ఆమోదించడం జరిగిపోయాయి.

 అయితే విధాన మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులకు చుక్కెదురైంది. సెలక్ట్ కమిటీకి పంపాలన్న మండలి నిర్ణయంపై జగన్మోహనరెడ్డి, ఆయన వందిమాగధులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాను ఒకటి తలస్తే, మండలి వల్ల మరొక రకంగా అయిందని భావించిన సీఎం మండలి రద్దుకు నడుం కట్టారు. యుద్ధప్రాతిపదికన అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం పెట్టి, విపక్ష తెలుగుదేశం సభ్యులు హాజరు కాకపోవడంతో ఏక్రగీవంగా ఆమోదింపచేసుకున్నారు. 

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా, పునరుద్ధరించిన మండలి ఆయుష్షు తీయడానికి జగన్మోహనరెడ్డి నిర్ణయించడానికి కారణం ఆయన అభీష్టాన్ని మండలి అడ్డుకోవడమే. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఏకపక్ష పోకడలకు పోకుండా ఎక్కడికక్కడ నియంత్రణరేఖలుంటాయి. దీన్ని మరచిన జగన్ తన మాటే శాసనంగా అమలవ్వాలని భావించి, అందుకు అడ్డొచ్చిన మండలిపై కత్తి ఎక్కుపెట్టారు. 

మండలి రద్దుకు జగన్ చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగా లేవు. మండలి వల్ల ఏడాదికి 60 కోట్ల రూపాయలు ఖర్చువుతున్నాయని, పేద రాష్ట్రానికి ఈ ఖర్చు అవసరమా అని జగన్ కొత్త వాదన తెచ్చారు. నిజమే. ఎపి పేద రాష్ట్రమే. పేద రాష్ట్రానికి లక్షల్లో జీతాలతో వందలాది మంది సలహాదారులు అవసరమా? వీరికి ఏడాదికి కోట్లలో జీతాలిస్తున్నారు. రాజధానిని మూడు చోట్ల పెట్టమని సలహాలిచ్చింది కూడా ఈ సలహాదారులేనా?  పేద రాష్ట్రంలో 1300 కోట్లతో పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం అవసరమా? ఇప్పుడు కోర్టు ఆ రంగులు తొలగించాలని తీర్పు చెప్పింది. దానికయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా? శాసనసభలోనే మేధావులు అనేకమంది వుండగా, ప్రత్యేకంగా మేధావుల సభ ఎందుకు అని సీఎం అంటున్నారు. రాజశేఖరరెడ్డిగారు మండలిని పునరుద్ధరించినప్పుడు శాసనసభలో మేధావులు లేకనే పునరుద్ధరించారనుకోవాలా?

ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ వైఖరి వుంది.  అసలు విధాన మండలి వల్ల ఉపయోగం లేదని, ప్రజాప్రయోజనాలకు విఘాతమని భావిస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు రద్దు చేయలేదు? ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాక, రద్దు నిర్ణయం తీసుకోవడం జగన్ ప్రతీకార వైఖరికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతీకార వైఖరులకు తావు లేదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన చేయాలి. గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్లే ఈ ప్రభుత్వానికి అఖండ విజయం లభించింది. ఇప్పుడు విజయగర్వంతో మేము అనుకున్నదే చేస్తామంటే భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనవలసి వుంటుంది.


03-01-2020 | 0 | 1034

పౌరసత్వ సవరణ చట్టంపై గత కొంతకాలంగా కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీరి చర్యల మూలంగా దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో ఒకరకమైన అభద్రతా భావం ఏర్పడింది. అసలు ఈ చట్టం ఏమిటి? ఎందుకు తెచ్చారు అనే విషయాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. 

పొరుగు దేశాల్లో మతపరమైన అణచివేత, వేధింపులకు గురై భారతదేశానికి శరణార్దులుగా వలస వచ్చిన వారిని ఆదుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రాణాలరచేత పట్టుకుని పిల్లాపాపలతో మన దేశానికొచ్చిన వారికి రక్షణ కల్పించి, చేయూత నివ్వడం మన సాంస్కృతిక, జాతీయ బాధ్యత. అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాము. దీని వల్ల ఏ భారతీయుడి పౌరసత్వమూ రద్దు కాదు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ లో మైనారిటీలుగా వున్న హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు ఆశ్రయం కల్పించడం వల్ల మన దేశానికి, దేశంలో వున్న పౌరులకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. మతప్రాతిపదికన విడిపోయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో  హిందువులు, సిక్కులు మైనారిటీలు. భారతదేశ విభజన సమయంలో వీరు అప్పటి నేతల హామీలను నమ్మి పాకిస్థాన్ లోనే వుండిపోయారు. 

అయితే తరువాత కాలంలో వీరిపై వేధింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. అక్కడ ఒకప్పుడు 20 శాతంగా వున్న హిందువుల జనాభా ఇప్పుడు రెండు శాతానికి పడిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హిందువులు ఎక్కడికెళతారు? మన దేశం మినహా ఏ దేశం కూడా వారికి ఆశ్రయమివ్వదు. శరణార్ధులుగా వచ్చి, ఇక్కడ కష్టాలుపడుతున్నవారికి ఆశ్రయమిస్తే ఈ పార్టీలకు వచ్చిన నష్టం ఏమిటి? వీరి వల్ల దేశానికొచ్చిన ప్రమాదం ఏమిటి? 

కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని సంఘాలు దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీళ్లు నిజమైన సెక్యులరిస్టులైతే ఆయా దేశాల్లో అణచివేతకు గురవుతున్నవారి  కోసం గళమెత్తాలి. పాకిస్థాన్ దాష్టీకాలపై వీరు నోరెత్తరు. అసలు వీరి ఆందోళనల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయి. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఆందోళనలు చేయడమే దీనికి నిదర్శనం. విపక్ష పాలిత రాష్ట్రాల్లో హింసాయుత ఆందోళనలు జరగడం లేదు.

పౌరసత్వ సవరణ చట్టం  ప్రకారం శరణార్ధులకు  పౌరసత్వం దక్కుతుంది, కానీ దేశంలో ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు. కానీ కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు దేశ  ప్రజల పౌరసత్వం రద్దవుతుందని దుష్ర్పచారం చేస్తున్నారు. అంతే కాదు.. జాతీయ జనగణనను కూడా వివాదాస్పదం చేస్తున్నారు. జనగణన జరగక పోతే అనేక విధాలుగా నష్టం జరుగుతుంది. ఆయా ప్రాంతాల జనాభాను బట్టి నిధుల విడుదల, పేదల కోసం వివిధ పథకాల రూపకల్పన జరుగుతుంది. సకాలంలో జనగణన జరగకపోతే వీటన్నింటికీ బ్రేక్ పడుతుంది. కాబట్టి విపక్షాల వాదనలు ఎండగట్టి, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. అందులో భాగంగానే భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తోంది.


25-12-2019 | 0 | 1036

అటల్ బిహారి వాజ్ పేయి. ఈ పేరు వినగానే మందస్మిత వదనంతో నిరాడంబర రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. రాజకీయాల్లో అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడు. భారత రాజకీయాల్లో అజాత శతృవు, వివాదరహితుడు శ్రీ వాజ్ పేయి. అందుకే పార్టీలకతీతంగా ప్రజలంతా ఆయన్ను అభిమానిస్తారు.

ప్రజాసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన వాజ్ పేయి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారు. యువకుడిగా వున్నప్పుడే లోక్ సభలో జవహర్ లాల్ నెహ్రూగారి ప్రశంసలందుకున్న వాజ్ పేయి పదిసార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తమ  పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఉర్రూతలూగించే ప్రసంగాలు, అలవోగ్గా చెప్పే కవితలు ఆయన్ను ప్రజలకు బాగా దగ్గర చేశాయి.

1944లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పూర్తికాలపు కార్యకర్తగా చేరిన వాజ్ పేయి, శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించిన జనసంఘ్ లో చేరిన వాజ్ పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్షుడయ్యారు. 70వ దశకంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవానికి మద్దతివ్వడంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. కొంతకాలం పాటు జైలు జీవితం గడిపారు. 1977 ఎన్నికలకు ముందు జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేశారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో సమర్థ విదేశాంగ మంత్రిగా పేరుతెచ్చుకున్నారు.  ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 

జనతా ప్రయోగం విఫలమయ్యాక, 1980లో శ్రీ ఎల్ కె అద్వానీతో కలిసి భారతీయ జనతాపార్టీని  స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. బిజెపిని 2 సీట్ల నుంచి అధికారం చేపట్టే దిశగా బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 1996 నుంచి 2004 మధ్యలో మూడుసార్లు ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించారు. లోక్ సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వున్నప్పుడు కూడా ఎలాంటి బేరసారాలకు దిగకుండా, హూందాగా దిగిపోవడం వాజ్ పేయి గారికే చెల్లింది. 

ఉదారవాదిగా వున్నప్పటికీ దేశ భద్రత విషయంలో రాజీపడని నైజం ఆయనది. 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు మన దేశంపై అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.  కార్గిల్ సెక్టార్ లో పాకిస్థాన్ సైన్యం, కశ్మీరీ తీవ్రవాదులు సంయుక్తంగా చేసిన దురాక్రమణ యత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు  కూడగట్టడంలో వాజ్ పేయి కీలక పాత్ర వహించారు. 1999 నుంచి 2004 మధ్యలో పూర్తి కాలం ప్రధాని  పదవిలో వున్న అటల్ జీ దేశాభివృద్ధికి బాటలు వేశారు. 

మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను వాజ్ పేయి కొనసాగించడమే కాకుండా దేశంలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. భారతదేశంలో రహదారుల వ్యవస్థను వాజ్ పేయికి ముందు ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. స్వర్ణ చతుర్భుజి పథకం వాజ్ పేయి ఆలోచనల నుంచి వచ్చినదే. దేశంలోని ప్రధాన జాతీయరహదారులన్నింటిని నాలుగు లైన్లుగా మార్చడం వల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు వేగవంతమైన రవాణా వ్యవస్థను సాకారం చేసింది. దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడంలో వాజ్ పేయి ప్రభుత్వం కృషి మరువలేనిది. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు, జాతీయనేతకు నిజమైన నిదర్శనం, భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి సదాస్మరణీయుడు.


19-12-2019 | 0 | 1008

రాజధానిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తూ వుంటే కేంద్రం చూస్తూ వూరుకోదు. అమరావతి రైతులు బంగారు పంటలు పండే భూములను ప్రభుత్వాలను నమ్మి రాజధాని కోసం ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన వారిని మోసం చేసే విధంగా వుంది.  అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నట్టుగా, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.

 హైకోర్టు ఒకచోట, రాజధాని మరొక చోట వుంటే పెద్దగా ఇబ్బందులేమీ వుండవు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. కానీ అసెంబ్లీ, సెక్రటేరియట్ వేర్వేరు చోట్ల వుంటే ఇబ్బందులెదురవుతాయి. సామాన్య ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కానీ పరిపాలనా కేంద్రం ఒక్కటే వుండాలి.

 రాజధాని నిర్మాణం విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాప్యం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్లు ఇచ్చింది. ఇప్పటికే అనేక కేంద్ర సంస్థలు, ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించారు. కొన్ని విద్యాసంస్థలు ప్రారంభం కూడా అయ్యాయి. అమరావతి తరలింపుపై ప్రభుత్వం లిఖితపూర్వక ప్రక్రియ మొదలుపెడితే అప్పుడు కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది. జరుగుతున్న గందరగోళాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.

 అమరావతిలో సచివాలయం లేకుండా కేవలం శాసనసభ మాత్రమే వుంటే దానిని రాజధాని అనరు. అమరావతి ఇప్పటికే రాజధానిగా ఏర్పడింది. సచివాలయ ఉద్యోగులు అనేక ప్రయాసలకోర్చి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు.  ఇప్పుడు మళ్లీ విశాఖ వెళ్లాలంటే మరింత ఇబ్బంది పడతారు. ఇదంతా ఒకరకమైన కక్షసాధింపుతో, ప్రజలను ఏడ్పించడానికి చేస్తున్నట్టుగా వుంది. ఈ ప్రభుత్వ వ్యవహారశైలితో కొత్త పరిశ్రమలు రాకపోగా, వున్నవి పోతున్నాయి. ఆదాయం తగ్గిపోయి, రాష్ట్రం తిరోగమనంలోకి వెళుతోంది. ఇప్పటికైనా ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి రాష్ట్రాభివృద్ధి దిశగా పని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను.


18-12-2019 | 0 | 1244

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, కొందరు వామపక్ష భావజాల మేధావులు చేస్తున్న దుష్ప్రచారం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అలజడి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే మైనారిటీల్లో అభద్రత సృష్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. యూనివర్శిటీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. 

 అసలు పౌరసత్వ సవరణ  బిల్లు వల్ల భారత పౌరులెవ్వరికీ ఎలాంటి హానీ జరగదు. భారతీయుల పౌరసత్వాన్ని ఎవరూ కూడా రద్దు చేయలేరు. దేశంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మతాల వారందరికీ రాజ్యాంగపరమైన హక్కులు, రక్షణలుంటాయి. భారతదేశం లౌకిక రాజ్యంగానే వుంటుంది. 

పొరుగు దేశాల్లో అణచివేతకు, దాడులకు గురయ్యే మైనారిటీ ప్రజలు శరణార్ధులుగా భారతదేశానికి వస్తే, వారికి పౌరసత్వం ఇవ్వడం వల్ల ఇక్కడున్న మైనారిటీలకెలాంటి నష్టం వాటిల్లదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతంలో శరణార్ధులకు భారతీయ పౌరసత్వం ఇస్తే తమ సంస్కృతి, భాష కనుమరుగవుతాయని ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అయితే వీరికెలాంటి నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఆరో షెడ్యూల్ అమలవుతోంది. అక్కడ బయటదేశాల వారే కాదు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా నివసించడానికి వీలు లేదు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ వుంది. ఈ ఐఎల్పీ వున్న ప్రాంతాల్లో వేరే వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోలేరు. 

కాబట్టి ఈ బిల్లు వల్ల ఈశాన్యానికి కానీ, దక్షిణాదికి గానీ, ఉత్తరాదికి గానీ, ముస్లింలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ లో దాడులుకు, బాధలకు గురై భారతదేశానికి వచ్చిన వారు గౌరవప్రదంగా జీవించడానికి తగిన ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుంది. కావున ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని విపక్షాల చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.


PreviousNext

Stay connected