దేశానికి మోడి భరోసా

ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్దం చేస్తోంది. కరోనా ధాటికి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అయితే భారతప్రభుత్వం ఎంతో ముందు చూపుతో 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో సామాన్యులకు ఆర్థిక భద్రత, పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పేదల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని లాక్ డౌన్ ప్రకటించిన 36 గంటల్లోనే వారి కోసం ప్యాకేజి రూపొందించింది.

లాక్  డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడే నిరుపేదలు, వలస కూలీల కోసం  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించింది. ఈ ప్యాకేజి కింద దేశంలో 80 కోట్ల మంది పేదలకు మూడు నెలల పాటు ఉచితంగా నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు ధాన్యాలు ఇప్పుడిస్తున్న రేషన్ కు అదనంగా ఇస్తారు. జనధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున ఖాతాలో జమ చేస్తారు.

ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెంచింది. పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులైన రైతులకు ఖరీఫ్ సాయం కింద ఏప్రిల్ లోనే రూ.2 వేలు ఇవ్వనున్నారు. డ్వాక్రా మహిళల రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన  పథకం కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు  ఉచితంగా గ్యాస్ సిలెండర్లు సరఫరా చేయనుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు విడతల్లో వెయ్యి రూపాయలు ఇవ్వనుంది.

కరోనా మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నవైద్య శాఖ, పారామెడికల్ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా ఇస్తోంది. వందమంది లోపు ఉద్యోగులుండే సంస్థల్లో పనిచేసే వారి పిఎఫ్ కేంద్రమే చెల్లించనుంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు కేంద్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వారంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకోవచ్చు.

ఒకవైపు వ్యాధి ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటూనే మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది, మధ్యతరగతి, వ్యాపారవర్గాలకు ఊరటనిచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు నిర్ణయాలు ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపులపై భయాందోళనలకు ఆర్బీఐ చెక్ పెట్టింది. బ్యాంకులిచ్చిన అన్ని రకాల రుణాల కిస్తీలను, క్రెడిట్ కార్డు బిల్లులను మూడు నెలల పాటు వాయిదా వేసింది. వర్కింగ్ క్యాపిటల్ పై వడ్డీలకు మూడు నెలలపాటు మారటోరియం విధించింది. కొత్తగా ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది.

రెపో రేటును 4.4 శాతానికి, రివర్స్ రెపో రేటును 4 శాతానికి తగ్గించడం, బ్యాంకుల నగదు నిల్వ నిష్పత్తిని గణనీయంగా తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెరగనుంది. జిడిపిలో 2 శాతానికి సమానమైన రూ.3.74 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి రానుంది. దీని వల్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు మేలు జరుగుతుంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రంగా వుంటాయి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మనం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఇవ్వాళ్టివరకు మిగతా ప్రపంచం కంటే మనం ఎంతో మెరుగైన స్థితిలో ఈ వైరస్ ను అదుపులో పెట్టాము. పలుదేశాల్లో వేలాది కేసులు,  మరణాలు సంభవించాయి. భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు వెయ్యి పైచిలుకు కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిజానికి జనంతో కిక్కిరిసి వుండే మన దేశంలో అంటువ్యాధి ప్రవేశించిందంటే దాని విస్తరణను అడ్డుకోవడం చాలా కష్టం.కానీ కేంద్ర ప్రభుత్వం ముందే మేల్కొని కఠిన చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా సహకరించడం వల్ల మనం మిగతా వారితో పోలిస్తే మెరుగైన స్థితిలో వున్నాం. మరికొన్నిరోజులు ఇబ్బందులను తట్టుకుంటే స్వల్ప నష్టంతో మనం బయటపడే అవకాశం వుంది. లాక్ డౌన్ లోను విరామం లేకుండా పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరికీ శతకోటి నమస్కారములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

en_USEnglish