మా గురించి

బహుముఖ వ్యక్తిత్వం

వ్యాపార, రాజకీయ పోటీ ప్రపంచంలో శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వ్యాపారంలో సమర్థతతో పాటు, ఆయనలోని స్నేహశీలత చౌదరి గారి విశిష్టత. ఆయనలోని ఉదార, ఉదాత్త వ్యక్తిత్వానికి ఆకర్షితులు కానివారు ఉండరు. ఆయనలో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయనతో ఒకసారి పరిచయమేర్పడితే అది జీవితకాలం నిలిచి ఉంటుంది. ప్రతి వ్యక్తిలోని నిగూఢమైన ప్రతిభను వెలికితీయాలని ఆయన ఆరాటపడతారు. చౌదరి గారిని అనుసరించే వారు ఎప్పుడూ ఆయన నాయకత్వ పటిమను, మార్గదర్శకాన్ని వదులుకోరు. చౌదరి గారు తనను అనుసరించే వారి బలహీనతలను అర్థం చేసుకోవడంలోనూ వారికి బలమైన ధృడసంకల్పాన్నిచ్చి దిశానిర్ధేశం చేయటంలోనూ, వారిని పోత్సహించటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయనతో పాటు ఆయన సహచరులు దశాబ్దాలగా ప్రయాణిస్తున్నారు.

బాల్యం & కుటుంబం

చౌదరి గారు జూన్ 2, 1961న కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. వారి తండ్రి గారి ఐదుగురు పిల్లలలో చౌదరిగారు నాలుగవ సంతానం. చౌదరి గారు పాఠశాల విద్యను మిర్యాలగూడలో, హైస్కూల్ విద్యను విజయవాడలో, ఉన్నత చదువులను హైదరాబాదు, తమిళనాడుల్లో అభ్యసించారు. 

యలమంచిలి కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని జంట గ్రామాలైన పొన్నవరం, పెదమద్దాలి ప్రాంతాలలో పేరొందింది. చౌదరి గారికి వారి తాతగారైన శ్రీ సత్యనారాయణ చౌదరి గారి పేరు పెట్టారు. తాతగారు పేరున్న కుటుంబ నేపధ్యం నుండి వచ్చారు. శ్రీ యలమంచిలి సత్యనారాయణ, శ్రీమతి యలమంచిలి ధనలక్ష్మీ దంపతులు 1950వ దశకంలోనే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. శ్రీ యలమంచిలి సత్యనారాయణ గారు ఇండియన్ పోలీస్ సర్వీసు (IPS) అధికారిగా పనిచేశారు. ఆయన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు. చౌదరి గారి మరో తాతగారైన (తల్లి గారి తండ్రి) శ్రీ శివలింగయ్య గారు కృష్ణా తాలూకా నుండి ఉన్నత విద్యను అభ్యసించిన మొదట పట్టభద్రులుగా ఘనత పొంది ఉన్నారు. 

చౌదరి గారి తండ్రిగారు శ్రీ యలమంచిలి జనార్ధనరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ విభాగంలో ఛీఫ్ ఇంజనీర్ గా సేవలు అందించారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి చేతులు మీదుగా పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. చౌదరి గారి తల్లి సుశీల కుమారి గృహిణి. జనార్ధనరావు గారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె - యలమంచిలి జతిన్ కుమార్, యలమంచిలి శివలింగ ప్రసాద్ (లేట్), యలమంచిలి శివరామకృష్ణ, యలమంచిలి సత్యనారాయణ, కుమార్తె ధనలక్ష్మీ ఉన్నారు. శ్రీ చౌదరి గారి కుటుంబానికి చెందిన మునుపటి తరాల వారు ఉన్నత పదవుల్లో ప్రభుత్వానికి సేవలు అందించగా, నేటి తరం వారంతా వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణిస్తున్నారు. 

చౌదరి గారి వ్యాపార రంగ సంస్థ పేరు సుజనా. ఇందులో తొలి అక్షరం వారి తల్లిగారైన సుశీల కుమారి పేరు కాగా మిగిలిన రెండు అక్షరాలు తండ్రి జనార్ధనరావు గారి పేరు నుంచి తీసుకున్నవి.

చౌదరి గారు ఒక పరిపూర్ణమైన కుటుంబజీవి. సతీమణి పద్మజ ఆయనకి అన్ని విషయాల్లో తోడునీడగా ఉన్నారు. వారికి కార్తిక్ అనే కుమారుడు, నాగ చాందిని అనే కుమార్తె ఉన్నారు. వారివురికి వివాహాలు అయ్యాయి.

చౌదరి గారు వ్యాపారవేత్తగా, తండ్రిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు. వ్యాపార, రాజకీయాలలో ఉంటూనే తన ఉమ్మడి కుటుంబంలో ఒక భర్తగా, తండ్రిగా, సోదరుడిగా, మామగా, చిన్నాన్నగా తనవారికి ఎప్పుడూ అండగా, ఆదర్శప్రాయంగా నిలిచారు.

విద్యాభ్యాసం

చౌదరి గారికి చిన్న వయస్సు నుండే ఇంజినీరింగ్ అంటే చాలా ఆసక్తి ఉండేది. దీంతో హైదరాబాద్ లోని CBIT కాలేజ్ లో మెకానికల్ ఇంజినీరింగ్ (1980-84) విద్యను అభ్యసించారు. అనంతరం కోయంబత్తూరులోని PSG కళాశాలలో మాస్టర్స్ ఇన్ మిషన్ టూల్స్ ఇంజినీరింగ్ (1984-86) పూర్తిచేశారు. చౌదరి గారి తండ్రి గారైన శ్రీ వై.జనార్థనరావు గారు కూడా 1955లో PSG కళాశాలలోనే మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి బ్యాచ్ లో చదవటం విశేషం.

పారిశ్రామిక ప్రస్థానం

చౌదరి గారి కుటుంబంలోని వారంతా ప్రభుత్వ కార్యాలయాలలో గౌరవమైన పదవులలో ఉన్నప్పటికీ, ఆయన మాత్రం సగటు తెలుగు కుటుంబాల్లో యువతలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాల వైపు వెళ్లలేదు. చౌదరి గారు ఉద్యోగ భద్రత కంటే ఉపాధి కల్పనా వైపే ఎక్కువ మొగ్గు చూపారు. ఆనాటి పరిస్థితుల్లో ఉపాధి కల్పనకు గల ప్రాముఖ్యతను, అవసరాన్ని గ్రహించిన చౌదరి గారు తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టి, కృషి పట్టుదలతో ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించారు.

1986లో గృహోపకరణాల వ్యాపారంతో మొదలుపెట్టి మధ్యతరగతి ప్రజలకి దగ్గరయ్యారు. అలా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, సుజనా గ్రూప్, స్టీల్, పవర్, టెలికాం, ఇన్ఫ్రాస్ట్రెక్చర్, ఎనర్జీ, హెల్త్ కేర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్, అప్లయెన్సెస్, లైట్ ఇంజినీరింగ్, విద్యా సంస్థలు, మరియు ఇండస్ట్రీయల్ ట్రేడ్ సంస్థల ఏర్పాటు ద్వారా ముప్పై సంవత్సరాల తన వ్యాపార సామ్రాజ్యాన్ని సుజనా గ్రూపుగా సమ్మిళితం చేసి దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.

కాలక్రమేణ మారుతున్న పరిణామాలు, బహిరంగ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సుజనా గ్రూప్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ చాలా వ్యాపారాల నుండి వైదొలిగింది. శ్రీచౌదరి గారు ఇప్పుడు ప్రెడిక్టివ్ హెల్త్, ప్రివెంటివ్ మెడిసిన్, ఎలక్ట్రిక్ వెహికల్, మొబిలిటి టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శిగా నిలుస్తున్పారు.

రాజకీయ జీవితం

వైఎస్ చౌదరిగారి రాజకీయ ప్రవేశం యాదృచ్ఛికం అని చెప్పొచ్చు. చౌదరిగారికి సమాజసేవ చేయాలనే ఆలోచన ఉండేది కానీ, చాలాకాలం వరకు ప్రత్యక్ష రాజకీయాల గురించి ఆలోచించలేదు.

చౌదరి గారికి పలువురు రాజకీయ నాయకులతో సాన్నిహత్యం ఉంది. అయినా ఆయన దృష్టి వ్యాపార రంగం మీదనే ఉండేది. ప్రత్యక్ష రాజకీయాలతో ఆయన పరిచయం చాలా కాలం తర్వాత జరిగింది. నటులు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు అయిన దివంగత ఎన్టీ రామారావు గారి సేవలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. 2005లో శ్రీ చౌదరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సలహాదారుగా సేవలందించారు. ట్రస్ట్ కార్యకలాపాలను విస్తరించడంలో చౌదరి గారు ముఖ్య పాత్ర వహించారు. ఈ కార్యకలాపాల నిర్వహణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారితో ఆయన పనిచేశారు. ఈ సమయంలో చౌదరి గారికి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం మరింత బలపడింది. చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారిని రాజకీయ రంగ ప్రవేశం చెయ్యమని వెన్నుతట్టి ప్రోత్సహించారు.

చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, ఆయన అండదండలతో చౌదరి గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో దోహదపడ్డారు. 2009 నాటికి శ్రీచౌదరిగారు టిడిపి అగ్రనేతలలో ఒకరిగా ఎదిగారు. ఆయన సేవలను గుర్తించిన టిడిపి 2010లో చౌదరి గారికి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవించింది.

అప్పటినుండి శ్రీ చౌదరి గారి రాజకీయ జీవితం మరింత క్రియాశీలకంగా, ప్రజా ఆధారితంగా మారింది. జాతీయ స్థాయిలో పార్లమెంటరీ కార్యకలాపాలు, విధివిధానాల రూప కల్పనలపై ఆయన ఆసక్తి కనబరిచారు. 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బిజెపితో పొత్తుకు మార్గం సుగమం చేయడంలో శ్రీ చౌదరిగారు కీలకపాత్ర వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలుపు సాధించింది. పదేళ్ల విరామం తరువాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడి నాయకత్వంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్టీఏలో తెలుగుదేశం భాగస్వామి అయింది. కేంద్రప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున చౌదరి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

చౌదరి గారి వ్యాపార-రాజకీయ ఆసక్తుల మధ్య వైరుధ్యాలకు తావివ్వకుండా, ఆయన నేపధ్యానికి, నైపుణ్యతకు, అనుభవానికి అనువుగా, కేంద్రంలో ఆయనకు శాస్త్ర సాంకేతికత మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది. కేంద్రంలో మంత్రిగా వైద్య, విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక మరియు పరిశోధన రంగాలను ఆయన ప్రోత్సాహించారు. వివిధ విభాగాలలో అనేక ఉన్నత విద్యాసంస్థలను, ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం వెనుక చౌదరి గారి విశిష్టమైన కృషి ఉంది. కేంద్రంలో సీనియర్ మంత్రులని ఒప్పించి, వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కి బహుళ సాయం జరగటానికి సహకరించారు. శ్రీ చౌదరి గారు మార్చి 2018 వరకు మంత్రి పదవిలో కొనసాగారు. ప్రత్యేక హోదా అంశం మీద విభేదాలతో బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలగాన్న టిడిపి నిర్ణయానికి అనుగుణంగా శ్రీ చౌదరి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతర పరిణామాల్లో ఆయన బిజెపిలో చేరారు. 2012 నుంచి ఏప్రిల్ 2022 వరకు క్రియాశీలక పార్లమెంట్ సభ్యునిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం అధికారిక పదవుల్లో లేనప్పటికీ చౌదరి గారు ప్రజాజీవితంలో తన సేవలతో ముందుకు సాగుతున్నారు. సకల జనుల ఆర్థిక సంక్షేమానికి అవసరమైన విధానాల రూపకల్పనలో పాత్ర వహిస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత గల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు పాత్రని నిర్వహించటంలో నిమగ్నమయ్యారు.

దాతృత్వం

దాతృత్వం శ్రీ చౌదరి గారిలో దాగిన మరో కోణం. వ్యక్తిగత హోదాలో ఆయన చేతికి ఎముక లేదన్నట్టు ఎంతోమందికి గుప్తదానాలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆయన తన వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇచ్చారు. 2007లో స్థాపించబడిన సుజనా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన సమాజంలో వివిధ వర్గాలకి సేవలు అందిస్తున్నారు. పేదల విద్య, వైద్యం, ఆరోగ్యంపై ట్రస్టు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందించటంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. 

దార్శనికత & పబ్లిక్ పాలసీ

ప్రజాజీవితంలోకి ప్రవేశించక మునుపే, అంటే 2004-05 నుంచే, శ్రీ చైదరి రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014 ఆగస్ట్ వరకు సుజనా గ్రూప్ సంస్థలకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగారు. తదనంతరం ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం అన్ని కార్పోరేట్ సంస్థల్లోనూ డైర్టక్టర్ గా వైదొలిగారు. ఆయన నెలకొల్పిన కంపెనీల్ని కుటుంబ సభ్యులు, తొలినుంచి శ్రీ చౌదరి గారితో కలిసి పనిచేసిన సహచరులు, స్నేహితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. చౌదరి గారు ప్రస్తుతం ఆరోగ్య రంగంలో వస్తున్న వినూత్న మార్పులు మీదా, ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణల మీద దృష్టి పెట్టారు. ఈ రంగాల్లో యువతకి సలహాదారుగా మార్గదర్శకత్వాన్ని, పర్యవేక్షణని అందిస్తున్నారు.

ఈ రంగాల్లో వస్తున్న పెను మార్పులని అధ్యయనం చేస్తూ, వాటిలో వస్తున్న కొత్త అవకాశాల్ని వినియోగించుకునే విధంగా వర్ధమాన యువ పారిశ్రామికవేత్తలకు సలహాలు ఇస్తున్నారు. 

3905686-200

ఆయన ప్రజల వ్యక్తి, ప్రతి వ్యక్తిలోని ఉత్తమమైన ప్రతిభను బయటకు తీసుకురావాలని నమ్ముతాడు. చౌదరి గారు వ్యాపారవేత్తగా, తండ్రిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు. వ్యాపార, రాజకీయాలలో ఉంటూనే తన కుటుంబంలో ఒక భర్తగా, తండ్రిగా, మామగా, అన్నగా తన పిల్లలకి, తన మనవలకు, తనవారికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

teTelugu