ప్రజాస్వామ్యంలో ప్రతీకార ధోరణులకు తావు లేదు

తన విధానాలను వ్యతిరేకించే వ్యక్తులను, వ్యవస్థలను తుదముట్టించడం ఫ్యాక్షనిస్టుల లక్షణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనం దీన్ని చూస్తున్నాం. అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్మోహన రెడ్డి అమరావతిని కేవలం చట్టసభల నిలయంగా వుంచి, పరిపాలనను విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా బిల్లు తయారుచేయడం, దాన్ని అసెంబ్లీ ఆమోదించడం జరిగిపోయాయి.

 అయితే విధాన మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులకు చుక్కెదురైంది. సెలక్ట్ కమిటీకి పంపాలన్న మండలి నిర్ణయంపై జగన్మోహనరెడ్డి, ఆయన వందిమాగధులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాను ఒకటి తలస్తే, మండలి వల్ల మరొక రకంగా అయిందని భావించిన సీఎం మండలి రద్దుకు నడుం కట్టారు. యుద్ధప్రాతిపదికన అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం పెట్టి, విపక్ష తెలుగుదేశం సభ్యులు హాజరు కాకపోవడంతో ఏక్రగీవంగా ఆమోదింపచేసుకున్నారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా, పునరుద్ధరించిన మండలి ఆయుష్షు తీయడానికి జగన్మోహనరెడ్డి నిర్ణయించడానికి కారణం ఆయన అభీష్టాన్ని మండలి అడ్డుకోవడమే. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఏకపక్ష పోకడలకు పోకుండా ఎక్కడికక్కడ నియంత్రణరేఖలుంటాయి. దీన్ని మరచిన జగన్ తన మాటే శాసనంగా అమలవ్వాలని భావించి, అందుకు అడ్డొచ్చిన మండలిపై కత్తి ఎక్కుపెట్టారు.

మండలి రద్దుకు జగన్ చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగా లేవు. మండలి వల్ల ఏడాదికి 60 కోట్ల రూపాయలు ఖర్చువుతున్నాయని, పేద రాష్ట్రానికి ఈ ఖర్చు అవసరమా అని జగన్ కొత్త వాదన తెచ్చారు. నిజమే. ఎపి పేద రాష్ట్రమే. పేద రాష్ట్రానికి లక్షల్లో జీతాలతో వందలాది మంది సలహాదారులు అవసరమా? వీరికి ఏడాదికి కోట్లలో జీతాలిస్తున్నారు. రాజధానిని మూడు చోట్ల పెట్టమని సలహాలిచ్చింది కూడా ఈ సలహాదారులేనా?  పేద రాష్ట్రంలో 1300 కోట్లతో పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం అవసరమా? ఇప్పుడు కోర్టు ఆ రంగులు తొలగించాలని తీర్పు చెప్పింది. దానికయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా? శాసనసభలోనే మేధావులు అనేకమంది వుండగా, ప్రత్యేకంగా మేధావుల సభ ఎందుకు అని సీఎం అంటున్నారు. రాజశేఖరరెడ్డిగారు మండలిని పునరుద్ధరించినప్పుడు శాసనసభలో మేధావులు లేకనే పునరుద్ధరించారనుకోవాలా?

ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ వైఖరి వుంది.  అసలు విధాన మండలి వల్ల ఉపయోగం లేదని, ప్రజాప్రయోజనాలకు విఘాతమని భావిస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు రద్దు చేయలేదు? ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాక, రద్దు నిర్ణయం తీసుకోవడం జగన్ ప్రతీకార వైఖరికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతీకార వైఖరులకు తావు లేదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన చేయాలి. గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్లే ఈ ప్రభుత్వానికి అఖండ విజయం లభించింది. ఇప్పుడు విజయగర్వంతో మేము అనుకున్నదే చేస్తామంటే భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనవలసి వుంటుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu