ప్రధాని మోడి దౌత్యనీతికి అద్దం పట్టిన ట్రంప్ పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి దౌత్యనీతి, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని, ఇనుమడింపచేసిన పర్యటన ఇది. హౌడి-మోడి, నమస్తే ట్రంప్ కార్యక్రమాల ద్వారా నరేంద్రమోడి ప్రపంచంలోనే బలమైన నేతగా గుర్తింపు పొందారు.

ట్రంప్ పర్యటన తొలి రోజున అహ్మదాబాద్ లో రోడ్ షో, మొతెరా స్టేడియంలో 1.25 లక్షల మంది హాజరైన భారీ బహిరంగసభ అద్భుతంగా జరిగాయి. ఒక విదేశీ అధినేత భారతదేశంలో ఇంత భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల్లోని కోట్లాది మంది ప్రజలతో పాటు యావత్ ప్రపంచం దీన్ని వీక్షించింది.

 ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాల మధ్య రూ. 21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా 24 ఎంహెచ్-60  రోమియో హెలికాప్టర్లు భారతీయ నౌకాదళం కోసం కొనుగోలు చేయనున్నారు. ఆరు ఎహెచ్ – 64 అపాచీ హెలికాప్టర్లను భారత ఆర్మీ అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. భారత అమ్ములపొదిని అత్యాధునికమైన అస్త్రాలతో బలోపేతం చేస్తున్నామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఒప్పందం రెండు దేశాల రక్షణ సంబంధాలను బలోపేతం చేయనుంది. దీంతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్ఎన్జీ లిమిటెడ్ , అమెరికాకు చెందిన చార్జ్ ఇండస్ట్రీస్ మధ్య సహకారానికి ఒప్పందం కుదిరింది. వైద్య ఉత్పత్తుల భద్రతపై భారత కేంద్రీయ ఔషధ ప్రయోగాల నియంత్రణ సంస్థకు, అమెరికాకు చెందిన ఎఫ్ డిఎకు మధ్య ఒప్పందం కుదిరింది.

అంతర్గత భ్రదత, రక్షణ, ఇంధనం, సాంకేతిక, ప్రజల మధ్య సత్సంబంధాలు అనే అంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ పరంగా భారత్ దేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ హామీ ఇవ్వడం భారతదేశ భద్రతకు మేలు చేకూర్చనుంది.  ఉగ్రవాద కార్యకలాపాలను తుడిచిపెట్టాలని తీర్మానించడం. ఇస్లామిక్ ఉగ్రవాదంపై కలిసి పోరాడతామని ట్రంప్ పేర్కొనడం పరోక్షంగా పాకిస్థాన్ కు హెచ్చరికలు చేయడమే. కశ్మీర్ అంశం, సరిహద్దు సమస్యల కారణంగా పాకిస్థాన్, చైనాలతో శతృత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవాల్సిన నేపథ్యంలో భారతదేశానికి అమెరికా సహకారం కీలకం. దీన్ని సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి విజయవంతమయ్యారని చెప్పవచ్చు.

తన పర్యటనలో ట్రంప్ పలుమార్లు భారత్ మహత్తర దేశమని, మోడి బలవంతుడైన నేత అని పేర్కొనడం భారతదేశం పట్ల, ప్రధాని మోడి పట్ల అమెరికా అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్ లో వివిధ మతాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు సామరస్యంగా జీవిస్తూ, తమ మత ధర్మాలు పాటించుకునే అవకాశం ప్రపంచానికే ఆదర్శమంటూ, తన మిత్రుడు నరేంద్రమోడి సమర్థ నాయకత్వంలో భారత్ బలమైన దేశంగా ఆవిర్భవిస్తుందని ట్రంప్ చెప్పడం శుభసూచికం. మొత్తంగా ట్రంప్ పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు పటిష్టం చేసుకునే దిశగా ముందడుగుగా భావించాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu