భారత ప్రజల అభిమాన నేత అటల్ జీ

అటల్ బిహారి వాజ్ పేయి. ఈ పేరు వినగానే మందస్మిత వదనంతో నిరాడంబర రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. రాజకీయాల్లో అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడు. భారత రాజకీయాల్లో అజాత శతృవు, వివాదరహితుడు శ్రీ వాజ్ పేయి. అందుకే పార్టీలకతీతంగా ప్రజలంతా ఆయన్ను అభిమానిస్తారు.

ప్రజాసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన వాజ్ పేయి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారు. యువకుడిగా వున్నప్పుడే లోక్ సభలో జవహర్ లాల్ నెహ్రూగారి ప్రశంసలందుకున్న వాజ్ పేయి పదిసార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తమ  పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఉర్రూతలూగించే ప్రసంగాలు, అలవోగ్గా చెప్పే కవితలు ఆయన్ను ప్రజలకు బాగా దగ్గర చేశాయి.

1944లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పూర్తికాలపు కార్యకర్తగా చేరిన వాజ్ పేయి, శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించిన జనసంఘ్ లో చేరిన వాజ్ పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్షుడయ్యారు. 70వ దశకంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవానికి మద్దతివ్వడంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. కొంతకాలం పాటు జైలు జీవితం గడిపారు. 1977 ఎన్నికలకు ముందు జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేశారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో సమర్థ విదేశాంగ మంత్రిగా పేరుతెచ్చుకున్నారు.  ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

జనతా ప్రయోగం విఫలమయ్యాక, 1980లో శ్రీ ఎల్ కె అద్వానీతో కలిసి భారతీయ జనతాపార్టీని  స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. బిజెపిని 2 సీట్ల నుంచి అధికారం చేపట్టే దిశగా బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 1996 నుంచి 2004 మధ్యలో మూడుసార్లు ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించారు. లోక్ సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వున్నప్పుడు కూడా ఎలాంటి బేరసారాలకు దిగకుండా, హూందాగా దిగిపోవడం వాజ్ పేయి గారికే చెల్లింది.

ఉదారవాదిగా వున్నప్పటికీ దేశ భద్రత విషయంలో రాజీపడని నైజం ఆయనది. 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు మన దేశంపై అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.  కార్గిల్ సెక్టార్ లో పాకిస్థాన్ సైన్యం, కశ్మీరీ తీవ్రవాదులు సంయుక్తంగా చేసిన దురాక్రమణ యత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు  కూడగట్టడంలో వాజ్ పేయి కీలక పాత్ర వహించారు. 1999 నుంచి 2004 మధ్యలో పూర్తి కాలం ప్రధాని  పదవిలో వున్న అటల్ జీ దేశాభివృద్ధికి బాటలు వేశారు.

మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను వాజ్ పేయి కొనసాగించడమే కాకుండా దేశంలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. భారతదేశంలో రహదారుల వ్యవస్థను వాజ్ పేయికి ముందు ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. స్వర్ణ చతుర్భుజి పథకం వాజ్ పేయి ఆలోచనల నుంచి వచ్చినదే. దేశంలోని ప్రధాన జాతీయరహదారులన్నింటిని నాలుగు లైన్లుగా మార్చడం వల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు వేగవంతమైన రవాణా వ్యవస్థను సాకారం చేసింది. దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడంలో వాజ్ పేయి ప్రభుత్వం కృషి మరువలేనిది. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు, జాతీయనేతకు నిజమైన నిదర్శనం, భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి సదాస్మరణీయుడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu